Thursday 20 March 2014

Jamadagni Maharshi


జమదగ్ని మహర్షి
పూర్వ కాలంలో ఋచీకుడను మహర్షి ఉండేవాడు. ఆయన గాధిరాజు దగ్గరకి వెళ్లి ఆయన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేయమని కోరాడు. దానికి ఆ రాజు తెల్లని శరీరము, నల్లని చెవులు గల వెయ్యి గుర్రములు తెచ్చియిస్తే పెళ్లి చేస్తానని చెప్పాడు. ఋచీకుడు వరుణ దేవుని ప్రార్థించి రాజుగారు కోరిన గుర్రములు తెచ్చియిచ్చాడు. మాట ప్రకారం సత్యవతిని ఋచీకునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. మహర్షి భార్యను వెంటబెటుకొని ఆశ్రమంకు వెళ్లి సుఖంగా ఉంటున్నారు. సత్యవతి చేయు సేవలకు మహర్షి సంతోషించి వరం కోరుకోమన్నాడు. సత్యవతి తన తల్లికొక పుత్రుడిని తనకొక పుత్రుడిని ప్రసాదించమని కోరింది. ఆయన సరేనని మంత్ర ప్రభావంతో రెండు యజ్ఞ ప్రసాదాలను సృష్టించి మొదటిది అత్తగారికి, రెండవది భార్యకు అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.
          ఆ సమయంలో కూతుర్ని చూద్దాం అని గాధిరాజు భార్యతో సహా వచ్చాడు. సత్యవతి సంతోషించి తను తీసుకోవలసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికి, తల్లి తీసుకోవాల్సిన ప్రసాదం తనూ పొరపాటున తీసుకున్నారు. అంతా దైవలీల గాధికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్నిమహర్షి జన్మించారు.
జమదగ్ని పెరిగి పెద్దవాడయ్యాక యుక్త వయస్సు రాగానే రేణువు కూతురు రేణుకను ఇచ్చి పెళ్లిచేశారు. జమదగ్ని సురభి అనే పేరుగల హోమ ధేనువును సంపాదించి దాని శక్తి సామర్ధ్యములతో సుఖంగా జీవిస్తున్నాడు. ఒక రోజు పగలు జమదగ్ని రేణుకను తీసుకొని నర్మదానదీ తీరాన ఏకాంతములో ఉండుట చూచిన సూర్యుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఈ పగటి సమయలో ఇలా ఉండటం తప్పని హెచ్చరించాడు. దాంతో జమదగ్నికి కోపం వచ్చి  రాహుగ్రహస్తుడవై తేజోహీనుడవు అవుతావని శాపం ఇచ్చాడు. దాంతో సూర్యునికి కోపంవచ్చి మంచికిపోతే చెడు ఎదురైనది నన్ను అనవసరంగా శపించావు నువ్వు కూడ నా శాపం అనుభవించు, ఒక రాజుతో పరాభవింపబడి ఆయన అస్త్రములతో మరణిస్తావు అని ప్రతి శాపం ఇచ్చాడు.
జమదగ్ని, రేణుక ఆశ్రమంకు వెళ్లారు. కొంతకాలములో రేణుక రుషుణ్వతుడు, సుసేషనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు అనే అయిదుగురు కుమారులని కన్నది. వారు పెరిగి పెద్దవారగుచున్నారు. ప్రతిరోజు రేణుక నీటికోసం ఏటికి వెళ్లి నీరు తెచ్చేది. ఓక రోజున ఆమె చిత్రరధుడనే ప్రభువు తన భార్యతో జలక్రీడలలో ఉండటం చూసి నిలబడింది. ఏమరుపాటున కుండ పగిలిపోయింది. ఖాళీ చేతులతో భార్య రావటం చూచి జమదగ్ని దివ్యదృష్టితో గమనించి మరణదండన విధించాడు. కుమారులను పిలచి తల్లిని చంపమన్నాడు. నాలుగురు పుత్రులు అంగీకరించలేదు.
పరశురాముడు ముందుకు వచ్చి తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని, అన్నలను చంపాడు. ఆతని ధైర్యానికి మెచ్చుకొని తండ్రి వరం కోరుకోమన్నాడు. తల్లిని, అన్నలను బ్రతికించమని తండ్రిని కోరాడు. పరశురాముని కోరికను మన్నించి అందరినీ సజీవులను చేశాడు జమదగ్ని మహర్షి.
కార్తవీర్యార్జునుడనే రాజు దత్తాత్రేయస్వామి వరంతో దేశం అంతా సంచరిస్తున్నాడు. ఒక రోజున సైన్యంతో జమదగ్ని ఆశ్రమంకు వచ్చాడు. ఆయన వారందరికీ పిండివంటలతో భోజనం పెట్టాడు. ఆ రాజు సంతోషించి ఈ విందు అంతా సురభి అనే అవు ద్వారా జరిగిందని తెలిసి ఆ ధేనువును తన కిమ్మని కోరాడు. జమదగ్ని ఒప్పుకోలేదు. ఆ రాజు సురభి కోసం జమదగ్ని మీద యుజ్ఞం మొదలుపెట్టాడు. జమదగ్ని సురభివైపు క్రీగంట చూడగానే అది సైన్యాన్ని సృష్టించింది. యుద్ధంలో సురభి సైన్యం ముందు రాజు సైన్యం ఓడిపోయింది. ఇక ఏమి చేయలేక జమదగ్నిని రాజు చంపాడు. సురభికోసం వెదుకగా అది అప్పటికే ఇంద్రుని వద్దకు వెళ్లిపోయింది. రేణుక సహగమనంకు సిద్ధం కాగా బృగుమహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించాడు.
వీటన్నింటికీ కారణమైన కార్తవీర్యార్జునుడనే రాజుని పరశురాముడు సంహరించాడు. ఆ వార్త తండ్రికి తెలిసి జమదగ్నితో రాజును చంపటం దోషం అనీ దాని కోసం ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేయమనీ చెప్పగా యాత్రలకు బయలుదేరాడు పరశురాముడు.
కాతవీర్యార్జునుని కుమారులు తమ తండ్రి మరణానికి కారకుడైన జమదగ్నిని పట్టి చంపారు. ఆ సమయంలో రక్షించమని తల్లి ఇరవై ఒక్కసారి పరశురాముడ్ని పిలిచింది. తీర్థయాత్రలు పూర్తి అయ్యాక వచ్చి పరశురాముడు జరిగింది తెలుసుకొని బాధపడి కోపంతో పరశువు చేతపట్టుకొని ఈ భూమి మీద రాజులందరినీ సంహరించి తండ్రికి రక్త తర్పణం చేశాడు. బృగువంశీయులందరూ క్రోధమూర్తులే.
జమదగ్ని మాత్రం శాంతి మూర్తి, క్షమాశీలి, ప్రశాంతజీవి, బృగువంశానికే మణిదీపిక. సప్త మహర్షులలో ఈయన ఒకరు.

No comments:

Post a Comment